Sunday, August 29, 2010

విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీ కృష్ణదేవ రాయలు

శ్రీ కృష్ణదేవ రాయలు (పా.1509-1529) అత్యంత ప్రసిద్ధవిజయనగర సామ్రాజ్య చక్రవర్తి. ఈయన పాలనలో సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. కృష్ణరాయలను తెలుగు మరియు కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. సాహిత్యములో ఈయన ఆంధ్ర భోజుని గా మరియు కన్నడ రాజ్య రమారమణ గా కీర్తించబడినాడు.
ఈయన పాలనను గురించిన సమాచారము పోర్చుగీసు సందర్శకులు డొమింగో పేస్ మరియు న్యూనిజ్ ల రచనల వలన తెలియుచున్నది. రాయలకు ప్రధాన మంత్రి తిమ్మరుసు. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించడానికి కూడా తిమ్మరుసు చాలా దోహదపదడినాడు. కృష్ణరాయలు తిమ్మరుసును పితృసమానునిగా గౌరవించేవాడు.కృష్ణదేవ రాయలు, తుళువ నరస నాయకుడు, నాగలాంబల (తెలుగు ఆడపడుచు) కుమారుడు.[1] ఇతను ఇరవై సంవత్సరాల వయసులో ఫిబ్రవరి 4, 1509న విజయనగర రత్నసింహాసనాన్ని అధిష్ఠించినాడు. ఇతని పట్టాభిషేకానికి అడ్డురానున్న అచ్యుత రాయలు నూ, వీర నరసింహ రాయలునూ, అనుచరులనూ తిమ్మరుసు సుదూరంలో ఉన్న దుర్గములలో బంధించినాడు.
రాజ్యం అధిష్ఠానం ఇతను రాజ్యం అధిష్ఠించునాటికి రాజ్యమంతా చాలా గందరగోళంగా ఉన్నది. దక్షిణాన సామంతులు స్వతంత్రులు అయినారు, తీరాంధ్ర ప్రాంతాన్ని గజపతులు ఆక్రమించుకొని తమ రాజ్యంలో కలుపుకొని, కొండవీడు, ఉదయగిరి వంటి పటిష్ఠమైన దుర్గములతో బ్రహ్మాండమైన రక్షణ ఏర్పాట్లు చేసుకున్నారు. బహమనీ సుల్తానులు రాజ్యంలోనికి రోజురోజుకూ చొచ్చుకొని రాసాగినారు. ఇటువంటి అస్తవ్యస్త పరిస్థితులలో శ్రీకృష్ణదేవరాయలు రాజ్యానికి వచ్చినాడు.

దక్షిణ దేశ దండయాత్ర
ఇతను 1509లో సింహాసనం అధిష్ఠించి, 1512 వరకూ మూడు సంవత్సరములు సైనిక సంపత్తిని పెంపొందించుకొని తొలిసారిగా దక్షిణ దేశ దిగ్విజయ యాత్రకు బయలుదేరినాడు.కావేరీ నదీ తీరంలోని శివపట్టణ పాలకుడు, విజయనగర సామంతుడైన గంగరాజు, విజయనగర రాజుల అలసత్వాన్ని ఆధారంగా చేసుకొని కప్పం చెల్లించక స్వతంత్రముగా ఉండసాగినాడు. ఇతని శత్రువు శ్రీ రంగపట్టణ రాజు చిక్క రాయలు. చిక్క రాయలు శ్రీకృష్ణదేవరాయల సైన్యంలో చేరి గంగరాజుపై యుద్ధం చేసి గెలిచినాడు. గంగరాజు కావేరి నదిలో పడి ప్రాణాలు వదిలినాడు.తరువాత ఉమ్మత్తూరు, కర్ణాటక, మైసూరు ప్రాంతములను చేజిక్కించుకొని చిక్క రాయలును వాటికి సామంతుని గా చేసినాడు. తరువాత చిన్న చిన్న పాలెగాండ్లను జయించి ఆ ప్రాంతములకు కెంపెగౌడ, వీర గౌడలను పాలకులుగా నియమించినాడు. (ఈ కెంపేగౌడ, వీర గౌడలే బెంగళూరు నిర్మాతలు). తరువాత మలయాళ ప్రాంతములను జయించి, వారినుండి కప్పములను వసూలు చేసినాడు. విజయప్ప, వేంకటప్ప నాయకులను పాండ్యదేశమునకు, దాని పరిసరాలకూ సామంతులుగా నియమించినాడు. విజయప్పనాయుడు, వెంకటప్ప నాయుడుతో కలసి రాయలువారి ఆదేశముపై చిత్తూరు, జింజి, తొండ మండలము, మధుర, తిరునగరు, తిరుచినాపల్లి మొదలగు ప్రాంతములను జయించినాడు. వీరందరి నుండి ఎంతో కప్పమును వసూలు చేసినాడు. ఒక్క జింజి నగరమునుండే సంవత్సరమునకు మూడు కోట్ల రూపాయల విలువైన కప్పం వచ్చేది. దీనితో దక్షిణ దేశమంతా రాయలు స్వాధీనమైనది.

పరిపాలనా సౌలభ్యం కోసం దీని మూడు భాగములుగా విభజించి నాడుజింజి కేంద్రముగా కృష్ణప్ప నాయకుడు అధిపతిగా నెల్లూరు మొదలగు ప్రాంతములు ఉండెను.తంజావూరు కేంద్రముగా విజయ రాఘవ నాయకుడు అధిపతిగా కావేరీ నదీ తీరప్రాంతములు రెండవ కేంద్రము.కొడగు కేంద్రముగా వెంకటప్ప నాయకుడు అధిపతిగా మళయాళ ప్రాంతము మూడవ భాగము.
ఈ దక్షిణదేశ దండయాత్ర తరువాత రాయలు రాజధానికి తిరిగి వచ్చాడు.
తూర్పు దిగ్విజయ యాత్ర
తిమ్మరుసు నాయకత్వంలో చక్కని సైన్యమును తూర్పు దిగ్విజయ యాత్రకు పంపించినాడు.

సైనిక విశేషములు

తిమ్మరుసు సైన్యమును చక్కగా వ్యూహాత్మకంగా విభజించినాడు. మొత్తం సైన్యాన్ని ఏడు భాగములుగా విభజించినాడు. ఒక్కొక్క విభాగములోను కింది దళాలు ఉన్నాయి:

• 30,000 కాల్బలము

• నాలుగు వేల అశ్విక దళము

• రెండువందల ఏనుగులు

ఈ విభాగాలకు అధ్యక్షులుగా కింది వారిని నియమించాడు.

1. రాయసము కొండమరుసు

2. పెమ్మసాని రామలింగ నాయుడు

3. గండికోట కుమార తిమ్మానాయుడు

4. వెలుగోడు గంగాధరరెడ్డి

5. అకినీడు ఇమ్మరాజు

6. ఆరవీటి నారపరాజు

7. ఆరవీటి శ్రీరంగరాజు

ఉదయగిరి విజయం

ఈ తూర్పు దిగ్విజయ యాత్రలో భాగంగా 1513లో ఉదయగిరి ని ముట్టడించినాడు. రాయసము కొండమరుసు విజయనగర సేనలకు ఆధిపత్యము వహించి సంవత్సరమున్నర పాటు తీవ్రమైన పోరాటము చేసి దుర్గమును స్వాధీనము చేసుకున్నాడు. తరువాత ఉదయగిరి ప్రాంత రాజప్రతినిధిగా అతడే నియమితుడయ్యాడు. కొండవీడు విజయం

1515లో రాయలు కొండవీడు ను ముట్టడించినాడు. కొండవీడు 1454నుండి గజపతుల ఆధీనంలో ఉన్నది. ఇదే సమయంలో ప్రతాపరుద్ర గజపతి కృష్ణానది ఉత్తర భాగమున పెద్ద సైన్యంతో విడిదిచేసెను. ఈ యుద్ధమున రాయలు విజయం సాధించాడు. తరువాత రాయలు కొండవీడును అరవై రోజులు పోరాడి 1515 జూన్ 6 న స్వాధీనం చేసుకున్నాడు.

తిమ్మరుసు మేనల్లుడు నాదెండ్ల గోపన దుర్గాధిపతిగా నియమితుడయినాడు.

కొండవీడు తరువాత శ్రీకృష్ణదేవరాయల దిగ్విజయ యాత్ర ఇలా సాగింది.

• అద్దంకి, కేతవరం, అమ్మనబ్రోలు, నాగార్జున కొండ, బెల్లంకొండ దుర్గాలను స్వాధీనం చేసుకున్నాడు.

• విజయవాడ సమీపాన ఉన్న కొండపల్లి దుర్గమును రెండునెలలు పోరాడి స్వాధీనం చేసుకున్నాడు.

• అనంతగిరి, ఉర్లుగొండ, ఉండ్రుగొండ, అరసవిల్లి, చిట్యాల, నల్లగొండ మొదలైన దుర్గాలను జయించాడు.

• కోనసీమ, జమ్మిలోయ, కోరాము, రాజమహేంద్రవరము లను జయించినాడు.

• మాడుగుల, వడ్డాది, సింహాచలములను స్వాధీనం చేసుకొని సింహాచల నరసింహ స్వామిని పూజించి అనేక దాన ధర్మాలు చేసినాడు.

• కటకం పైకి దండెత్తి ప్రతాపరుద్ర గజపతి ని ఓడించి అతని కుమార్తె తుక్కా దేవి ని వివాహమాడాడు.

ఈ దిగ్విజయ యాత్ర తరువాత రాయలు 1516 లో రాజధానికి తిరిగి వచ్చాడు.

బీజాపూరు దండయాత్ర

1520లో బీజాపూరు పైకి దండయాత్రకు సిద్ధమయినాడు. దీనికి రెండు కారణములు చూపుతారు. మద్గల్లు, రాయచూరు దుర్గములను సుల్తాను ఆక్రమించుట మరియు సయ్యద్ మరైకర్ అను వ్యాపారి రాయల వద్ద డబ్బులు తీసుకుని ఇస్తానన్న అరేబియా జాతి గుర్రాలను ఇవ్వకుండా బీజాపూరు సుల్తాను దగ్గర ఆశ్రయం పొందినాడు; తాకీదు పంపించినా ఈ వ్యాపారిని సుల్తాను రాయలకు అప్పజెప్పలేదు, రాయలు సొమ్ము ఇప్పించనూ లేదు.

సైనిక వివరములు

న్యూనిజ్ అను పోర్చుగీసు యాత్రికుని ప్రకారం సైన్యం ఇలా ఉన్నది:

1. కామా నాయకుడు (పెమ్మసాని రామలింగ నాయుడు) : 30,000 కాల్బలము, వేయి అశ్వములు, పదహారు గజములు

2. త్రయంబకరావు: 50,000 కాల్బలము, రెండు వేల అశ్వములు, ఇరవై ఏనుగులు

3. తిమ్మప్ప నాయకుడు : 60,000కాల్బలము, 3,500 ఆశ్విక దళము, 30 ఏనుగులు

4. ఆదెప్ప నాయకుడు : లక్ష కాల్బలము, ఐదువేల ఆశ్విక దళము, 50 ఏనుగులు

5. కొండమ రెడ్డి 1 : 1,20,000 కాల్బలము, 6000 గుర్రాలు, 60 ఏనుగులు

6. కొండమ రెడ్డి 2 : 80,000 కాల్బలము, 2050 గుర్రాలు, 40 ఏనుగులు

7. సాళువ గోవింద రాజు : 30,000 కాల్బలము, 1000 గుర్రాలు, 10 ఏనుగులు

8. మధుర నాయకుడు : 15,000 కాల్బలము, 200 గుర్రములు

9. కుమార వీరయ్య : 8,000 కాల్బలము, నాలుగు వందల గుర్రములు

10. రాయలు : 44,000 కాల్బలము, 7,000 గుర్రములు, 315 ఏనుగులు

మొత్తం 5,37,000 కాల్బలము, 27,150 గుర్రములు, 1151 ఏనుగులు. పోరు భీకరముగా జరిగింది. ఇరువైపులా అనేక మంది నేలకూలారు. ఆదిల్ షా ఏనుగునెక్కి పారిపోయినాడు. సేనానులు దిక్కుతోచని వారైనారు. చివరకు ఎంతో ప్రాణ నష్టము తరువాత యుద్ధం 1520 మే 19న ముగిసింది. ఈ విజయం వలన రాయలుకు విశేషమైన డబ్బు, గుర్రాలు, ఏనుగులు లభించినాయి.

రాయచూరు యుద్ధము

తరువాత రాయచూరు కోటను ముట్టడించి ఇరవై రోజులు యుద్ధం చేసి పోర్చుగీసు సైనికుల సహాయంతో విజయం సాధించాడు (రాయచూరి యుద్ధము). రాయలు రాజధానికి వెళ్ళినా, త్వరలోనే మరలా ముద్గల్లు, బీజాపూరు లను ముట్టడించి ధ్వంస పరచి కల్యాణి, గుల్బర్గా కోటలను స్వాధీనం చేసుకున్నాడు.



తరువాత రాయలు రాజధానికి వచ్చి నిశ్చింతగా కవితా గోష్టులను నిర్వహించినాడు.

వారసులు

• ఇతనికి ఇద్దరు భార్యలు, తిరుమల దేవి, చిన్నాదేవి .

• ఇద్దరు కుమార్తెలు, వారిలో పెద్ద కూతురు తిరుమలాంబను రామ రాయలు కు, చిన్న కూతురును రామ రాయలు సోదరుడైన తిరుమల రాయలు కు ఇచ్చి వివాహం చేసాడు.

• ఒక్కడే కొడుకు, తిరుమల దేవ రాయలు . ఇతనికి చిన్న తనంలోనే పట్టాభిషేకం చేసి, తానే ప్రధానిగా ఉండి రాజ్యవ్యవహారాలు చూసుకునేవాడు. కాని దురదృష్టవశాత్తూ తిరుమల దేవ రాయలు 1524 లో మరణించినాడు. ఈ విషయం పై కృష్ణ దేవ రాయలు తిమ్మరుసును అనుమానించి అతనిని గుడ్డివానిగా చేసాడు. తానూ అదే దిగులుతో మరణించినాడని ఓ అభిప్రాయము. మరణానికి ముందు చంద్రగిరి దుర్గమునందున్న సోదరుడు, అచ్యుత రాయలు ను వారసునిగా చేసాడు.

• రాజ్య పాలన

240 కోట్ల వార్షికాదాయము కలదు.

సాహిత్య పోషకునిగా

కృష్ణదేవరాయలు స్వయంగా కవిపండితుడు కూడా కావడంతో ఇతనికి సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని బిరుదు. ఈయన స్వయంగా సంస్కృతంలో జాంబవతీ కళ్యాణము, తెలుగులో ఆముక్తమాల్యద లేక గోదాదేవి కథ అనే గ్రంథాన్ని రచించాడు. రాయల ఆస్థానమునకు భువన విజయము అని పేరు. భువనవిజయము లో అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, మాదయ్యగారి మల్లన (కందుకూరి రుద్రకవి), అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజభూషణుడు (భట్టుమూర్తి), తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిది మంది కవులు ఉండేవారని ప్రతీతి. వీరు అష్టదిగ్గజములు గా ప్రఖ్యాతి పొందారు.

అష్టదిగ్గజములు

1. అల్లసాని పెద్దన,

2. నంది తిమ్మన,

3. ధూర్జటి,

4. మాదయ్యగారి మల్లన (కందుకూరి రుద్రకవి),

5. అయ్యలరాజు రామభద్రుడు,

6. పింగళి సూరన,

7. రామరాజభూషణుడు (భట్టుమూర్తి),

8. తెనాలి రామకృష్ణుడు

9. కవిగా

ఇతను మత సహనం కలవాడు. అనేక వైష్ణవ, శైవ దేవాలయములను నిర్మించినాడు; అనేక దాన ధర్మాలు చేసినాడు. ముఖ్యంగా తిరుమల శ్రీనివాసులకు పరమ భక్తుడు, సుమారుగా ఆరు పర్యాయములు ఆ దేవదేవుని దర్శించి అనేక దానధర్మాలు చేశాడు. ఇతను తన కుమారునికి తిరుమల దేవ రాయలు అని, కుమార్తెకు తిరుమలాంబ అని పేర్లు పెట్టుకున్నాడు. రాయలు విజయనగరాధీశులందరిలోకీ చాలా గొప్పవాడు, గొప్ప రాజనీతిజ్ఞుడు, సైనికాధికారి, భుజబల సంపన్నుడు, ఆర్ధిక వేత్త, మత సహనము కలవాడు, వ్యూహ నిపుణుడు, పట్టిన పట్టు విడువని వాడు, కవి పోషకుడు, రాజ్య నిర్మాత మొదలగున్న సుగుణాలు కలవాడు. ఇతను దక్షిణ భారతదేశం మొత్తం ఆక్రమించినాడు.

Tuesday, August 10, 2010

కమనీయ దృశ్యం.. కనిగిరి దుర్గం

గత వైభవాలకు ప్రతిరూపాలే చారిత్రక కట్టడాలు !   కోట్లు వెచ్చించినా కట్టలేని అలాంటి కట్టడాలు మన రాష్ట్రంలో అనేకం ఉన్నాయి. వాటిని కాపాడుకోవాల్సిన భాధ్యత ప్రభుత్వం, మనందరిపైనే ఉంది. ఆ కోవకు చెందినదే ‘కనిగిరి’ దుర్గం.  
ప్రకృతి అందచందాలతో అలలారే ఈ దుర్గం నాటి నుండి నేటి వరకు గత వైభవానికి చిహ్నంగా, కమనీయంగా వెలుగొందుతుంది. రాజులు, రాజ్యాలు అంతరించినా వారి ప్రాభవానికి, కళాతృష్ణకు ఆనవాలుగా నిలిచిన ఎన్నో అద్భుతమైన కళాఖండాలు నేటికి ఇక్కడ దర్శనమిస్తున్నాయి. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలుకు 80 కిలోమీటర్ల దూరంలోనున్న... ఒకప్పుడు ‘కనకగిరి’గా ఖ్యాతిగాంచిన నేటి కనిగిరి దుర్గం చరిత్ర ఇది.
చరిత్ర కలిగిన కనిగిరిలోనే 13-14 వ శతాబ్దంలో యాదవ రాజైన కాటమరాజు, మనుమసిద్దులకు పోరాటం జరిగింది. అనంతరం శ్రీ కృష్ణదేవరాయలు కనిగిరి దుర్గంలో కొలువు ఏర్పరుచుకొన్నాడు. ఈ దుర్గంలో ఉన్న చెన్నముక్క బావి, సింగరప్ప దేవాలయాలు ఆయన కాలంలో నిర్మితమైనవే. ఇవి నేటికి సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వీరి కాలంలోనే నిర్మించిన కోటబురుజులు, ప్రహరీ, లోదుర్గంలోని మందుకొట్టాలు, చెన్నమ్మబావి, గుర్రపుశాలలు, ఏనుగుల బావి, మండాలు చరిత్ర మరవని చారిత్రాత్మక దృశ్యాలు. ఆ తరువాత 1520 లో వీరభద్ర గజపతి, రెడ్డిరాజులు ఈ ప్రాంతాన్ని పాలించగా... 1776లో కనిగిరి దుర్గం సుల్తానుల ఏలుబడిలో ఉన్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. లోదుర్గం చుట్టూ ఉండే 26 కిలోమీటర్ల కోటగోడ ఇప్పుడు 20 కిలోమీటర్ల మేర ఉండి చూపరులను అమితంగా ఆకర్షిస్తున్నది.
బొగ్గుల గొంధి ప్రాంతంలోని కోటగోడ ప్రధాన ద్వారం గుండానే నాడు ఇక్కడ పరిపాలించిన రాజులు రాకపోకలు సాగించారని ప్రతీతి. కోటకు నాలుగు వైపుల ఉండే నాలుగు కోట బురుజుల్లో 3 బురుజులు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. దొరువుకు సమీపంలో ఉండే ప్రధాన బురుజులలో ఒకటైన బురుజు పర్యాటకులకు ఇక్కడి చారిత్రక ప్రసిద్ధిని గుర్తుచేస్తున్నది. లోదుర్గంలోని దుర్గమ్మ గుడి, సీతారాముల గుడి గత వైభవాలకు చిహ్నలుగా నిలిస్తున్నాయి. కోటలో ప్రత్యేక ఆకర్షణగా ఉన్న మందుకొట్లు, మండెం, ఏనుగులబావి, గుర్రపుశాలలు, నీటి కొలనులు, సువిశాల ప్రాంగణం, కొలనులో నీటి చలమలు ప్రకృతితో పోటీ పడుతూ వీక్షకులను అలరిస్తున్నాయి.
40 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు ఉండే మూడు అరలుగల మందుల కొట్లు ఆనాటి రాజుల యుద్ధ సామర్ధ్యానికి ప్రతీకలుగా ఉన్నాయి. ఈ దుర్గంలో 2 కిలోమీటర్లు వ్యాపించి ఉండే నేలగొయ్యి, రహస్య గొయ్యి, నాగుల పొదలు సైతం నేటికి సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నాటి చారిత్రక కట్టడాలకు స్వాగత తోరణంగా ఉన్న కనిగిరిని ఆనుకొని ఉన్న దుర్గం దానికి ముందుండే సింగరప్ప ఆలయం గత స్మృతులకు నిదర్శనం. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన వారు లోదుర్గంలోని వింతలను, విశేషాలను, పరిశోధనాత్మకంగా తిలకిస్తూ, సందర్శిస్తున్నారు. ప్రతి ఏడాది వేసవి కాలంలో కనిగిరి కోటను సందర్శించడం కోసం ఇతర రాష్ట్రాల నుండి సైతం పర్యాటకులు అధికసంఖ్యలో రావడం విశేషం. దేశ సంస్కృతికి, పురాతన చరిత్రకు సాక్ష్యాలుగా మిగిలిన ఈ ప్రాచీన కట్టడాలు కాలగర్భంలో కలసిపోకుండా కాపాడాలంటే పురావస్తు శాఖ, రాష్ట్ర పర్యటక శాఖ చర్యలు శ్రద్ధవహించి గత వైభవాన్ని నేటి, భావితరాలకు అందించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
కోటలోని ప్రత్యేక ఆకర్షణలు...
దుర్గం చుట్టు ఉండే కొండ పై భాగంలో అక్కడక్కడ ప్రకృతి పేర్చిన అందాలు చూపరులను అమితంగా ఆకట్టుకుంటాయి. వీటిలో ముఖ్యంగా బొగ్గుల గొంధి ప్రాంతంలో ఉన్న తాబేలు రాయి, దుర్గం ఉత్తరం వైపునున్న ఉగ్గుగిన్నె రాయి, దుర్గంలోనున్న డైనోసార్‌ రాయి, చింతకాయ రాయి, పాము రాయి, అక్కా చెల్లెళ్ళ బండలు, చేపరాయిలు ప్రధానాకర్షణగా ఉన్నాయి. వీటి నుండే ఆదిమానవుని రూపాంతరం వెలువడినట్లు చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి.
                                                                                             - బత్తుల రామ్‌ప్రసాద్‌

Friday, August 6, 2010

రాయలు శ్రీవారికి సమర్పించిన ఆభరణాల చరిత్ర!

శ్రీకృష్ణదేవరాయలు తన ఇష్టదైవమైన తిరుపతి వెంకటేశ్వరస్వామికి సమర్పించిన ఆభరణాల్లో చాలా వరకు గల్లంతైనట్లు వార్తలొచ్చాయి. ఇందులో కొన్ని ఆభరణాలను కరిగిపెట్టి ఉండొచ్చని.. మరికొన్ని ఇతర నగలతో కలిసి పోయి ఉండొచ్చని టీటీడీ అధికారులు నివేదించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో శ్రీకృష్ణదేవరాయలు శ్రీవారికి సమర్పించిన ఆభరణాల వివరాలు లభ్యమయ్యాయి. శ్రీకృష్ణదేవరాయలు మొత్తం ఏడు సార్లు తిరుమల దర్శించుకున్నట్లు ఈ నివేదిక ద్వారా తెలుస్తోంది. ఈ వివరాలిలా ఉన్నాయి. తొలి సందర్శన: శ్రీకృష్ణదేవరాయలు తొలిసారి క్రీ.శ. 1513 ఫిబ్రవరి 10న తిరుమలదేవీ, చిన్నాజీదేవీలతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ సమయంలో ఆయన రత్నకిరీటం, నగలు, ఇతర విలువైన రాళ్లను శ్రీవారికి సమర్పించారు. రాణులు బంగారు కప్పులు, ప్లేటు బహూకరించారు.

1513 మే 2: రాయలు ఈ పర్యటన సమయంలో ఎంతో ఉదారంగా కత్తులు, విలువైన రాళ్లతో పొదిగిన ఇతర ఆభరణాలు, వజ్రాలు, ముత్యాలతో కూడిన మూడు కిరీటాలు, కెంపులను ఉత్సవర్లకు సమర్పించారు.
1513 జూన్ 13: తొమ్మిది రకాల విలువైన రాళ్లతో కూడిన తొమ్మిది సెట్ల బంగారు ఆభరణాలను శ్రీవారికి సమర్పించారు. వివిధ కార్యక్రమాల నిర్వహణ కోసం గొడగరనాడు ఉప జిల్లాలోని మూడు గ్రామాలైన చత్రవాది, తూరూరు, కరి కంబుడులను సమర్పించారు.

1514 జూలై 6: రాణులతో కలిసి ఒడిషా పర్యటన నుంచి వెనక్కి వెళుతూ శ్రీవారిని శ్రీకృష్ణదేవరాయలు దర్శించుకున్నారు. అప్పుడాయన శ్రీవారి సన్నిధిలో 30 బంగారు వరహాలతో కనకాభిషేకం నిర్వహించారు. విలువైన రాళ్లు పొదిగిన బంగారు ఆభరణాలను కూడా సమర్పించారు. తలపాకం గ్రామాన్ని శ్రీవారికి అప్పగించారు. తొమ్మిది రకాల వజ్రాలు పొదిగిన నవరత్న ప్రభావళి సెట్‌ను కూడా శ్రీవారికి బహూకరించారు.
1517 జనవరి 2: భగవంతుని ప్రవే శ ద్వారం వద్ద కృష్ణదేవరాయ, తిరుమలదేవి, చిన్నాదేవిల రాగి విగ్రహాలను ప్రతిష్టించారు. 30 వే ల వరహాలను అభయారణ్యం వద్ద ఏ ర్పాట్లకే కేటాయించా రు. తిరుపతిలో నిర్వహించిన వివిధ కార్యక్రమాలకు 500 వరహాలు ఇచ్చారు.
1518 అక్టోబర్ 16: పెద్ద రాణి తిరుమలదేవితో ఈ దఫా రాయలవారు శ్రీవారిని దర్శించుకున్నారు. అప్పుడే పుట్టిన తమ బిడ్డకు స్వామివారి ఆశీస్సులు పొందేందుకు ఆయన తిరుమల వచ్చారు. ఆ బిడ్డకు 'తిరుమల' అనే నామకరణం చేశారు. అయితే ఈ పర్యటనకు సంబంధించి ఎలాంటి లిఖితపూర్వక ఆధారాలు లేవు.

1521 ఫిబ్రవరి 17: శ్రీకృష్ణదేవరాయులు తిరుమలలో జరిపిన తుది పర్యటన ఇది. ఈ పర్యటనలో ఆయన తొమ్మిది రకాల విలువైన రాళ్లతో పొదిగిన పీతాంబరం సెట్‌ను శ్రీవారికి బహూకరించారు. దీంతోపాటు ముత్యాలతో పొదిగిన టోపీ, కెంపులు, 1000 వరహాలు సమర్పించారు. రాణి తిరుమలదేవి నవరత్న హారాన్ని బహూకరించారు. ఇవేగాక శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి బంగారు కిరీటంతో పాటు తొమ్మిది రకాల విలువైన రాళ్లను స్వామివారికి ఇచ్చారు. పలు రకాల విలువైన ఆభరణాలు, వజ్రాలు పొదిగిన వస్తువులనూ సమర్పించారు. అంతే కాకుండా ఎంతో బరువైన బంగారు ఆభరణాలు , 2822 శుద్ధి చేసిన కెంపులు, 160 వైడూర్యాలు, 423 పాత వజ్రాలూ ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయలు శ్రీవారికి సమర్పించిన వాటిలో పలు కిరీటాలు, నెక్లెస్‌లు, మాణిక్యాలు కూడా ఉన్నాయి.

రాయల వంశీకులు ఇంకా ఉన్నారా?

రాజ్యాలు పోయాయి.. రాచరిక వ్యవస్థా అంతరించిపోయింది. అయినా ఒకనాటి రాజరిక ఔన్యత్యాన్ని తలచుకుంటూ శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేక పంచశతాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం. ముగింపు ఉత్సవాలు ఈ నెల 6వ తేదీ నుంచి రాయలవారి రెండో రాజధాని పెనుగొండలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో.. ఆయన వంశీకులు ఇంకా ఉన్నారా? ఉంటే ఎలాంటి జీవితం గడుపుతున్నారు? అనే ఉత్సుకతతో వారిని వెతుక్కుంటూ వెళ్లింది 'ఆన్‌లైన్'. ఆనెగొందిలో నివసిస్తున్న రాయల వంశానికి చెందిన 17వ తరం వారిని పలకరించింది. రాజసం ఉట్టిపడుతున్నా రాచరికపు పోకడలు ఏమాత్రం కనిపించని శ్రీరంగదేవరాయలు, లలితారాణిల జీవితాలను గమనించింది. ఆ సంగతులేంటో చదవండి.
శ్రీకృష్ణదేవరాయలు వంశానికి చెందిన 17వ తరం వారు ప్రస్తుతం గంగావతి, ఆనెగొందిలో నివాసం ఉంటున్నారు. అక్కడి ప్రజలకు ఇవాళ్టికీ రాయల కుటుంబమంటే ఎంతో గౌరవం. ఆ కుటుంబంలోని వారు ఎవరు వీధి వెంబడి వస్తున్నా పురుషులు వెంటనే లేచి నిలబడతారు. మహిళలు ఇళ్లలోకి వెళ్లిపోతారు. ఆనెగొందిలోనే కాదు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఏ శుభకార్యం జరిగినా రాయల కుటుంబీకులకు ప్రత్యేక ఆహ్వానం అందుతుంది. ఇంటికి వచ్చేవారిని ఆప్యాయంగా పలకరించడం, చేతనయిన సాయం చేయడం రాయల కుటుంబీకుల సంప్రదాయం.

ఆనెగొందిలో ఏ ఇంట్లో పెళ్లి జరిగినా రాయల వారి ఇంటి నుంచే తాళిబొట్టు వెళుతుంది. చిన్నాపెద్ద, కులమత తారతమ్యాలు ఈ గ్రామంలో అస్సలు కనిపించవు. ముస్లింలు సైతం ఏ పండుగ వచ్చినా నమాజ్ చేసిన తర్వాత నేరుగా రాయలవారి ఇంటికే వెళ్లిపోతారు. వారికి శుభాకాంక్షలు చెప్పిన తర్వాతే మిగతా కార్యక్రమాలు మొదలుపెడతారు. అలాగే హిందువుల పండగలప్పుడు కూడా గ్రామస్థులకు రాయలవారి నుంచి కానుకలు అందుతాయి.
ఈ ఆచారం వందల సంవత్సరాలుగా ఆ గ్రామంలో కొనసాగుతోంది. గ్రామంలో ఏ మతస్థుల ఇంట్లో వివాహాలు, ఇతర శుభకార్యాలు జరిగినా మరో మతం వారు సహాయం చేస్తారు. ఇంతటి ఐక్యత ఆనెగొందిలో కనిపిస్తుందంటే అది రాయల వారి చలవే అని చెబుతారు గ్రామస్థులు. ప్రభుత్వ పరంగా కూడా అధికారులతో మాట్లాడి ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కూడా రాయల కుటుంబీకులు ముందుంటారు. వారి సూచన మేరకే ఇప్పటికీ ఆనెగొందిలో గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతుంటాయి. ఏకగ్రీవ ఎన్నిక విధానం అక్కడ ఆనవాయితీ. ఒక్కోసారి ఒక్కో సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు.
ఉత్సవాల్లోనూ అదే గౌరవం
హంపి విరూపాక్ష ఆలయంలో ఇప్పటికీ ప్రధాన ద్వారం నుంచి వెళ్లి స్వామిని దర్శించుకునే అవకాశం కేవలం రాయల కుటుంబీకులకే ఉంది. మిగతా ఎవరికీ ఆ అవకాశం లేదు. హంపి రథోత్సవాన్ని ప్రారంభించేది ఈ కుటుంబీకులే. ఆనెగొంది చుట్టూ ఉన్న పలు ప్రముఖ దేవాలయాలు ఇప్పటికీ వీరి ఆధీనంలోనే ఉన్నాయి.
అందులో శ్రీరంగనాథస్వామి దేవాలయం, నవ బృందావనం, ఉచ్చప్పయ్య మఠం, 64 స్తంభాల మండపం, చింతామణి ఆలయం, గజశాల, ఒంటెశాల, ఆదిశక్తి దుర్గాదేవి ఆలయం, మేల్కోటే, గవి రంగనాథస్వామి దేవాలయం, పంపాసరోవరం (విజయలక్ష్మి దేవస్థానం), అంజినాద్రిబెట్ట ముఖ్యమైనవి. ఈ పురాతన ఆలయాలన్నింటిలోనూ రాయల కుటుంబీకుల ఆధ్వర్యంలోనే హోమాలు, ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. రాయల కుటుంబీకుల్లో ఎవరి వివాహం నిశ్చయమైనా మొదట హంపీలోనే పూజలు చేస్తారు. ఆ తర్వాతే పెళ్లి పనులు మొదలవుతాయి. వీరి కుటుంబాల్లో పెళ్లిళ్లు ఇప్పటికీ కృష్ణదేవరాయల కాలంనాటి పద్ధతుల్లోనే జరుగుతుంటాయి.
వ్యవసాయమే జీవనాధారం
శ్రీకృష్ణ దేవరాయల వంశీయుల్లో 16వ తరానికి చెందినవారు శ్రీవెంకటపతిరాజు. ఆయనకు ముగ్గురు కుమారులు శ్రీఅచ్యుతదేవరాయలు, శ్రీరంగదేవరాయలు, శ్రీనరసింహదేవరాయలు. అచ్యుతదేవరాయలు మరణించగా, నరసింహదేవరాయలు హోస్పెట్ నగరంలో న్యాయవాదిగా ఉన్నారు. శ్రీరంగదేవరాయలు, ఆయన పెదనాన్న కొడుకు శ్రీరామదేవరాయలు మాత్రం ఆనెగొందిలోనే ఉంటున్నారు. వ్యవసాయమే జీవనాధారంగా సాధారణ జీవితం గడుపుతున్నారు. శ్రీరంగదేవరాయలు భార్య లలితారాణి.
వీరికి పూర్వీకుల ద్వారా సంక్రమించిన ఆస్తి 30 ఎకరాల దాకా ఉంది. ఇందులో వరి, అరటి, మల్బరీ, కొబ్బరి తదితర పంటలను సాగు చేస్తున్నారు. నిత్యం స్వయంగా పంట పొలాలను పరిశీలిస్తూ కూలీలకు సూచనలిస్తుంటారు. ఆనెగొందిలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన ఇంటిని ఆధునీకరించుకున్నారు. గంగావతిలోనూ ఓ చిన్న ఇల్లు నిర్మించుకున్నారు.
రాజకీయాల్లోనూ చురుకుగా...
శ్రీరంగదేవరాయలు 1983 నుంచి వరుసగా ఐదు సార్లు కాంగ్రెస్ పార్టీ తరపున గంగావతి నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒకసారి మంత్రిగా కూడా పనిచేశారు. రాష్ట్ర ఖాదీ గ్రామోద్యోగ బోర్డు చైర్మన్‌గా పనిచేశారు. 2004లో జరిగిన ఎన్నికల్లో మొదటిసారి ఓడిపోయారు. ప్రస్తుతం ఆయనకు 72 సంవత్సరాలు.
ఆయన సతీమణి లలితారాణి కూడా రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. 1987లో జడ్పీ స్థానాన్ని మహిళలకు కేటాయించడంతో పోటీ చేయాలని పార్టీ నుంచి, అభిమానుల నుంచి ఒత్తిడి రావడంతో ఆమె కూడా రాజకీయాల్లోకి వచ్చారు.
గంగావతి తాలూకా సమితి అధ్యక్షురాలిగా పనిచేశారు. 2005-06లో కొప్పళ్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పని చేశారు. ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఆహ్వానం మేరకు 2008లో బీజేపీలో చేరారు. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర హస్తకళల బోర్డు చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. వారి పూర్వీకులు స్థాపించిన విజయలక్ష్మి మహిళా మండలి బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు.
ప్రాజెక్టులకు రాయలు పేరు పెట్టాలి
'మాకు ఇద్దరు అబ్బాయిలు. ఒకరు హోస్పేట్‌లో వ్యాపారం చేసుకుంటున్నారు. మరొకరు లండన్‌లో ఎంఆర్‌సీఎస్ పూర్తి చేసి బెంగుళూరులో స్థిరపడ్డారు. ప్రముఖుల పిల్లలు అనే భావన రాకుండా వారిని దూరంగా చదివించాం. మాకు ఉన్నంతలో ఇతరులకు సాయం చేస్తున్నాం. శ్రీకృష్ణదేవరాయల వంశీకులుగా మాకు కీర్తి ఉంది. అదే మాకు గర్వకారణం.

గతంలో ప్రభుత్వ పరంగా రాయల కుటుంబీకులకు పెన్షన్ వచ్చేది. ఇప్పుడు అది ఆగిపోయింది. మేం మళ్లీ దరఖాస్తు చేసుకోలేదు. ఆంధ్రాలో జలయజ్ఞం పేరుతో ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు కడుతున్నారు. శ్రీకృష్ణదేవరాయలు భవిష్యత్ తరాలకు గుర్తుండాలంటే ఆయన పేరు పెద్ద పెద్ద ప్రాజెక్టులకు పెట్టాలి. ఇలా చేస్తే జనం కూడా హర్షిస్తారు. రాయల ఉత్సవాలను రెండు రాష్ట్రాలూ జరపడం సంతోషమే. కర్ణాటక నుంచి మాకు ఆహ్వానపత్రికయినా అందింది. కాని పెనుగొండలో జరిగే ముగింపు ఉత్సవాలకు అదీ లేదు.
- శ్రీరంగదేవరాయలు, లలితారాణి దంపతులు 
- పట్టుపోగుల రామాంజనేయులు, ఆన్‌లైన్, అనంతపురం. ఫోటోలు: కరణం హనుమేష్ రావు, ఎండీ జాకీర్ హుస్సేన్.
ఆంధ్రజ్యోతి సౌజన్యంతో..



Thursday, August 5, 2010

యయాతి వంశీకుడు శ్రీకృష్ణదేవరాయలు!

'కృష్ణరాయలు-అస్తిత్వాల ప్రశ్నలు'(జూలై 21, ఆంధ్రజ్యోతి) వ్యాసకర్త పాణి అనేక విషయాలను ప్రస్తావిస్తూ అత్యంత బాధాకరమైన వ్యాఖ్యలు చేశారు. 'తమ కులం నుంచి రాజరికంలోకి ప్రవేశించిన వ్యక్తిగా బలిజ కులస్తులకు రాయల అస్తిత్వ ప్రతీక అయ్యాడు. ఆ కులానికి అనేక సామాజిక అనుభవాలు, ప్రత్యేకతలు ఉన్నాయి గదా' అన్నారు. రాయలు బలిజ కులస్తుడని వీరికున్న ఆధారాలేమిటి? సామాజిక అనుభవాలు, ప్రత్యేకతలు-ఆ ఒక్క కులానికేనా ఉన్నది? ఏ కులానికుం డే అనుభవాలు, ప్రత్యేకతలు ఆ కులానికుంటాయి. అదిక్కడ అప్రస్తుతం కదా! రాయల గురించి ఇన్ని కబుర్లు చెబుతున్న పాణి వారి వంశవృక్షాన్ని గురించి తెలుసుకోకుండానే ఇన్ని మాటలు చెబుతున్నారా? కృష్ణరాయల కులాన్ని గురించి పాణి వ్యక్తం చేసిన అభిప్రాయాలపై యాదవ జాతి తీవ్ర అభ్యంతరం తెలియ చేస్తుంది.
ఒక చారిత్రక వాస్తవాంశాన్ని వక్రీకరిస్తూ ఒకరు మాట్లాడినప్పుడు, ఆ విషయా న్ని గూర్చి ప్రశ్నించటం సమంజసమనే సద్భావనతో ఈ అంశాన్ని గురించి మాట్లాడాల్సి వస్తుంది. లేకపోతే సమాజానికి తప్పుడు సంకేతాలిచ్చిన వారమవుతాం; చరిత్రను వక్రీకరించిన వారమవుతాం. కృష్ణరాయల గరించి ఇన్ని విషయాలు మాట్లాడుతున్న పాణి, ఆయన స్వయంగా రాసిన 'ఆముక్తమాల్యద' కావ్యం చదవలేదనుకోవాలా? కృష్ణదేవరాయలు తాను చంద్రవంశ క్షత్రియుడినని ఆ కావ్య పీఠికలోని 19వ పద్యంలో, యాయాతి వారుసుడినని 22వ పద్యంలో చెప్పుకున్నా డు.
యాయాతికి, దేవయాని జన్మించిన వారు -యదువు, తుర్వసుడు. మిగిలిన ముగ్గురు కుమారులు -యాయాతికి, శర్మిష్ఠకు జన్మించినవారు. వీరందరూ యాదవులే. 'ఆ తుర్వసుని వంశమే తుళువ వంశమని ఏర్పడినది'-అని కృష్ణరాయలే స్వయంగా చెప్పుకున్నాడు. ఇంత స్పష్టంగా ఇంతటి ఆధారం కళ్ళకు కనబడుతుం టే, కృష్ణ దేవరాయలును -బలిజ కులస్తుడని పాణి ఎలా అనగలిగారు?
'శ్రీకృష్ణదేవరాయ వైభవం' అనే సంకలన గ్రంథంలో 'శ్రీకృష్ణదేవరాయలు- వంశావళి' అనే వ్యాసం రాసిన యన్. యస్. రామచంద్రమూర్తి ఇలా పేర్కొన్నారు: 'శ్రీకృష్ణదేవరాయలు తుళువాన్వయులని, యాదవ కులజులని చెప్పబడినది'. వసుదేవుని కుమారుడు కావున శ్రీకృష్ణుడు వాసుదేవుడైనట్లు, దశరథుని కుమారుడు కావున దాశర థి అయినట్లు తుర్వసుని సంతానం 'తుళువ' పరం గా గుర్తించబడ్డారని, వీరు యాదవ కులస్తులని ఇటు తెలుగు పండితులు, అటు కన్నడ పండితులు అంగీకరించారు.
శ్రీకృష్ణదేవరాయల ఆస్థానకవి నంది తిమ్మన, తాను రాసిన 'పారిజాతాపహరణ ము' కావ్యంలో ఎన్నోచోట్ల శ్రీకృష్ణదేవరాయలును యాదవుడుగా పేర్కొన్నాడు. ఆ కావ్య స్వీకర్త కూడా శ్రీకృష్ణ దేవరాయలే. తన ఆస్థానంలోని కవి, తన గురించి, తన వంశావళిని గురించి తప్పుగా రాస్తే ఏ రాజైనా సహించగలడా? ఏ కవి అయినా తన రాజును గూర్చి తప్పుగా రాయటానికి సాహసించగలడా? ఈ కావ్యం లోని ప్రథమా శ్వాసము నందలి 'కృతిపతి (చంద్ర) వంశ ప్రశస్తి'లోని, 17, 19 పద్యాలు అత్యంత కీలకమైనవి.
పందొమ్మిదవ పద్యంలో ' నాడు నేడును యాదవాన్వయ ము నందు జననమందెను వసుదేవ మనుజ విభుని కృష్ణుడను పేర నరసేంద్రు కృష్ఱదేవరాయడను పేర నాది నారాయణుండు' అంటూ శ్రీకృష్ణ దేవరాయలు యాదవుడని స్పష్టీకరించాడు నంది తిమ్మన. మరి పాణి ఈ కావ్యం చదవలేదా? ఆచార్య యార్లగడ్డ బాలగంగాధరరావు గతంలో 'కమ్మ వికాసం'లోను, నేడు 'పల్నాటివీరచరిత్ర'లోను అతి స్పష్టంగా చెప్పారు-శ్రీకృష్ణదేవరాయలు యాదవుడని.
ఆచార్య ఎస్ గంగప్ప 'తెలుగు విద్యార్థి' (జూలై 2010)లో తెలుగు కన్నడ రచయితల గ్రంథాలను స్పష్టంగా ఉదహరిస్తూ , ఆధారసహితంగా-శ్రీకృష్ణ దేవరాయలు యాదవుడని స్పష్టంగా వివరించి చెప్పారు. పి. శ్రీరామమూర్తి రాసిన 'ఏ హిస్టరీ ఆఫ్ విజయనగర ఎంపైర్' అనే గ్రంథంలో కృష్ణరాయలు యాదవుడే అని (126వ పేజీ) పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన మరెన్నో ఆధారాలు మా వద్ద ఉన్నాయి. ఈ ఆధారాలన్నింటి మూలంగా శ్రీకృష్ణదేవరాయలు యాదవుడేన ని మేము స్పష్టంగా ప్రకటిస్తున్నాం. ఇందుకు అభ్యంతరమున్న వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తే, చర్చకు యాదవ జాతి సిద్ధంగా ఉంది.
కన్నడ రాయడుగా పేరు పొందిన రాయలును తెలుగు రాజుగా చూపటానికి చేస్తున్న ప్రయత్నాలలో జాతి ప్రాతిపదిక ఉందని పాణి అన్నారు. కృష్ణరాయల జన్మతః కన్నడిగుడే అయినప్పటికీ, తన చిన్నతనం నుంచీ తెలుగుదేశంలో (చంద్రగిరి ప్రాంతంలో) పెరిగి ఇచ్చట భాష, సంస్కృతి, ఆచార వ్యవహారాలను పాటించి పూర్తిగా తెలుగు వాడయ్యాడు.
అదే మమకారంతో తన రాజ్యంలో కన్నడ , తమిళ ప్రాంతాలు ఉన్నప్పటికీ అత్యధికంగా తెలుగు కవులనే పోషించాడు. తాను స్వయంగా 'ఆముక్త మాల్యద'కావ్యాన్ని తెలుగులో రచించాడు. తన తాను తెలు గు రాజుగా చెప్పుకున్నాడు. 'దేశ భాషలందు తెలుసు లెస్స'అన్నాడు. ఇంతగా తెలుగు నేలతో తెలగు భాషతో మమేకమైన కృష్ణరాయలును తెలుగు రాజుగా చెప్పుకోవటం నేరమా? ఒక్క పూట భోజనం పెట్టిన వాడికి పదిసార్లు కృతజ్ఞతలు చెప్పుకుంటామే! తెలుగు భాషకు శాశ్వత కీర్తి ప్రతిష్ఠలు ఆర్జించి పెట్టిన ఒక మహనీయునికి కృతజ్ఞతా సూచకంగా మన చేస్తున్నదేపాటి?
-యద్దనపూడి వెంకటరత్నం యాదవ్